Sunday, June 30, 2019

నీవేగా



నా హృదయారాధనలో రూపానివి నీవేగా
నా కవితా మాధురిలో భావానివి నీవేగా

తేనెలొలుకు కనులతో తిలకించేనేస్తమా
నా కలల దారులలో దీపానివి నీవేగా


తొలి చూపుల వలలతో కవ్వించే మౌనమా
నా ఊహల మాలలలో దారానివి నీవేగా

వేధించే అమాసల తోడుండే బంధమా
నా అక్షర గీతానికి లక్ష్యానివి నీవేగా


గాయమైన వెదురులో గానమైన గీతమా
నా వూపిరిలో నిండిన నాదానివి నీవేగా!!!

కలికి


అచ్చ తెలుగు పదమల్లె పలికిందీ ఈకలికి
ముచ్చటైన కవితల్లే నిలిచిందీ ఈకలికి

పచ్చ చీర గట్టినట్టి ప్రకృతిలాగ కనిపిస్తూ
పెళ్ళికూతురల్లె సిగ్గు లొలికిందీ ఈకలికి


తొలివేకువ కిరణంలా నులివెచ్చగ తాకుతూ
ఆమనిలో కోయిలలా పిలిచిందీ కలికి


వెంటాడే చూపులతో ఊసులేవొ వినిపిస్తూ
మకరందపు బిందువులే చిలికిందీ ఈకలికి


నవ కవితా గానంలో నాయకిలా నర్తిస్తూ
నండూరీ ఎంకిలాగ అలిగిందీ కలికి!!!

వానచినుకులు


నేలతల్లికి దప్పికంతను దిద్ది వేసెను వానచినుకులె
పూలతీవెకు కొత్తవన్నెల నద్ది వేసెను వానచినుకులె
ఆకసమ్మున ధారలన్నియు అంతకంతకు హద్దుమీరెను
కాగితమ్ముల పడవలన్నియు గుర్తుచేసెను వానచినుకులె
పూలగొడుగును చేతబట్టుకు నీటిముత్యములేరుతుంటే
నాడు ఆడిన ఆటలన్నియు రాశిపోసెను వానచినుకులె
ఆకతాయీ చల్లగాలులె ఆనవాళ్ళను ఒడిసిపడితే
యవ్వనమ్మున రాగసుధలను అందజేసెను వానచినుకులె
పచ్చపచ్చని తరువులన్నియు ప్రణయరాగము లాలపిస్తే
కరిగి పోయిన కాలమంతయు కనుల నిలిపెను వానచినుకులె
నీలికలువా చందురేడని కొండకోనా అడుగుతుంటే
వానవిల్లున ప్రేమలేఖను  పంపుచుండెను వానచినుకులె!!!


Saturday, June 29, 2019

ఆనందం (1)









1.      ఎండలన్ని తగ్గిపోయి వానొచ్చిన ఆనందం
ఎండవాన కలిసినపుడు విల్లొచ్చిన ఆనందం

ఆరుబయట వెన్నెలలో నిదురించిన వేళలోన
ఒక్కసారి సొంతఊరు వెళ్ళొచ్చిన ఆనందం.   

కన్నవారి కలలు దీర్చు సమయమ్మున కన్నులలో
కష్టపడిన ఫలితానికి గెలుపొచ్చిన ఆనందం.

తిరుమలగిరి కొండపైన వెంకన్నను చూడగానె
నల్లనయ్య మాఇంటికి నడిచొచ్చిన ఆనందం.

చినుకు తడికి చిగురుతొడిగి పూవులన్ని విరబూయగ
ఆతారలు నాచేతికి అందొచ్చిన ఆనందం.

అస్మదీయులందరినీ అక్షరాల కలియువేళ
విస్మయముగ షేర్లనడుమ విరుపొచ్చిన ఆనందం

పాతతెలుగు పాటలన్ని పరిమళాలె శైలజా
గుండెగొంతులోన కదలి పాటొచ్చిన ఆనందం.


అంటాను 2 (పున్నాగవనం)



5.5..5..5(ఖండగతి)
భావాల జల్లులో తడవమని అంటాను
భావుకత్వపు గజలు పాడమని అంటాను

ముసుగులో నీ మోము దాచుతా వెందుకో?
ప్రేమయో !ద్వేషమో! చూపమని అంటాను

నినుచూడ మనసంత పూవనిగ మారింది
ప్రేమ జలమును రోజు పోయమని అంటాను


మోసాలు ద్వేషాలు దేశదౌర్భాగ్యాలు
మోహాల సంకెళ్ళు త్రెంచమని అంటాను

గజలునే వ్రాయగా సులభమే అయిననూ
విరుపులే తేవడం కష్టమని అంటాను

గజలుకే అందమ్ము విరుపులే శైలజా
భావాల పరిళము దూయమని అంటాను!!!


వరదాయిగా 3(పున్నాగవనం)




సంకీర్ణ గతి... 4-5; 4-5; 4-5; 7

మాయని ప్రేమయే మధురస కావ్యమూమమతలు పూయించు వరదాయిగా
న్యాయపు మార్గమే నవరస భరితమూ నవ్వుతు నడిపించు వరదాయిగా

కన్నులు నీకొరకె వెదకును నిత్యమూ ఆశల పొదరింట ననుచేరవా
నామది చల్లగా వెన్నెల జల్లగా మనసే మురిపించు వరదాయిగా

మదిలో మాటలూ పాటగ మారినవి వలపుల రాగమే పలికించవా
ఎంతగ వేచేది ఎన్నని చెప్పేది ప్రియతమ కనిపించు వరదాయిగా

విరహం జ్వాలగా వేదన రేగగా వేణువు నొకసారి మ్రోగించవా
గానము చేరినది గారడి చేసినది తెరలను తొలగించు వరదాయిగా

తారలు శైలజను గేలిగ చూసినవి తమనెలరాజుతో తారాడుచూ
ఎచ్చటనుంటివో ముచ్చట లాడుచూ కరుణే చిలికించు వరదాయిగా!!!


అంటాను 1 (పున్నాగవనం)




ఖండగతి..5 5 5 5 
కలలతో గడపకా కదలమని అంటాను
కలముతో యుద్ధమే చేయమని అంటాను

నా పిలుపు సోకనీ దూరాన నీవుంటె
దైవమా రెక్కల్ని ఈయమని అంటాను

సృష్టిలో మాయనిది ప్రేమయే తెలుసుకో
నా ఆయుషే నీకు పోయమని అంటాను

తీరానికే నావ చేసేటి పయనాన
ఆటులూ పోటులూ ఖాయమని అంటాను

చెలిమినే పంచితే గ్రీష్మాన తొలకరే
మనసునే మల్లెలా పూయమని అంటాను

పున్నాగ పూవులే పూచాయి వనములో
నీ మురళి నొకసారి మ్రోగమని అంటాను

శైలజా! కురిసింది నేలపై చిరుజల్లు
అంకురమ్ములు తెచ్చి నాటమని అంటాను!!!

Monday, June 24, 2019

పూలవాన




నీటిముత్తెములను చిలికి మురిపించెను పూలవాన
నిన్ను నన్ను జతగ కలిపి నడిపించెను పూలవాన

గుండెలోన మాటలన్ని గొంతు దాటి రాకున్నవి
శ్రూతిని లయను ఒకటిచేసి పాడించెను పూలవాన

తీగతెగిన హృదయవీణ మూగబోయి తానుంటే
తీగలన్ని సవరించి పలికించెను పూలవాన

బంధాలే శాశ్వతమని భ్రమపడ్డా బాల్యములో
జ్ఞాపకాలె శాశ్వతమని తెలిపించెను పూలవాన

చేయి కనుల కడ్డుపెట్టి తనకోసం చూస్తున్న
రైతన్నల పొలములన్ని తడిపించెను పూలవాన

కాలమనే కాగితాన గజళ్ళనే శైలజా
చిరిగిపోక చెరిగిపోక నిలిపుంచెను పూలవాన!!!