Monday, November 19, 2018

అవసరమేగా....


వెన్నెలకాంతులు జారాలంటే జాబిలినవ్వులు అవసరమేగా
సిగ్గులనిగ్గులు తేలాలంటే సరసపు చెణుకులు అవసరమేగా

ఆమని వేళల హాయిగ కోయిల రాగము లెన్నో తీసెనులే
పాటల మాధురి పొందాలంటే పచ్చని తరువులు అవసరమేగా

కవితా సుమములు పూయాలంటే మదిలో మధనం జరగాలి
కలకాలం అవి నిలవాలంటే కమ్మని పలుకులు అవసరమేగా

మాటలకందని వేదనలేవో మనసునే మెలిపెడుతుంటే
మోమున నవ్వులు విరియాలంటే ముత్యపు చినుకులు అవసరమేగా

పురినే విప్పుతు  ఆనందంతో నెమలియె నాట్యంచేసింది
నయనానందపు నర్తనచూడగ నల్లని మబ్బులు అవసరమేగా

పూచిన పూవులు మురియాలంటే దేవుని సన్నిధి చేరాలి
పూవుల కోరిక తీరాలంటే కోమలి కరములు అవసరమేగా…!!!



Saturday, September 29, 2018

ఓ..మది


ఓ..మది

ఎన్ని ఊహలు ఎన్ని కోర్కెలు ఎన్ని ఆశలు పూచె నో మది
ఎన్ని ఆటలు ఎన్ని పాటలు ఎన్ని మాటలు దాచె నోమది

పొద్దు పొడవగ నిద్దురంతయు బద్దకమ్ముగ వదలి పోవగ
ముద్దు ముద్దుగ ముంగిలందున పూలబాలల చూచె నోమది

ఏది ఎందుకు ఇచ్చునో మరి ఎవరి నెందుకు కలుపునో విధి
ఏది శాశ్వత మేది సత్యము ఏమెరుంగక వేచె నోమది

పంచ మమ్మున పాడుకోయిల అన్ని ఋతువుల పాడలేదుగ
జీవితమ్మను నావదారిని వెలుగు చీకటి కాచె నోమది

కాన రానీ బంధనాలే కాళ్ళకే సంకెలలు వేయగ
శైలజా !నీపాట లోకపు తీరుతెన్నుల తూచె నోమది.!!!

మంచు తుంపర



మంచు తుంపర


గాలి పల్లకి లోన దాగుచు తట్టి లేపెను మంచు తుంపర
మేలు కొమ్మని పల్లె కన్నెను తట్టి లేపెను మంచు తుంపర

నేల తల్లికి తీర్చ దాహము జాలువారుచు బొట్టు బొట్టుగ
నిదుర పోయెడి పూల బాలల తట్టి లేపెను మంచు తుంపర

అమ్మ రెక్కల నొదిగి  పోవుచుకమ్మకమ్మని కలలు గాంచుచు
చెమ్మ ఎరుగని చిట్టి గువ్వల తట్టి లేపెను మంచు తుంపర

వీధిదీపపు నీడలందున దారి ప్రక్కన బాటలందున
మొద్దునిద్దుర పోవు బిక్షుల తట్టిలేపెను మంచు తుంపర

వ్రాలి పోయెడు తీగలందున సోలిపోయెడు శాఖలందున
మేలుగా లేలెమ్మనంచు తట్టి లేపెను మంచుతుంపర

బీడువారిన నేల గుండెల బిక్క చచ్చిన పైరు పాపల
వాడవాడల గూడుగూడుల తట్టిలేపెను మంచుతుంపర!!!


Sunday, June 24, 2018

నేర్చుకో....





 నేర్చుకో..
అనుభవాల పాఠాలు చదవడం నేర్చుకో
అవరోధా లెదురైన గెలవడం నేర్చుకో

మానవతే లేకుంటే మనుగడే ఎందులకు
అమ్మలాగమమతను పంచడం నేర్చుకో

ద్వేషమును వీడితే అమృతమే చిందదా
తూటాలను వదిలేసి ప్రేమించడం నేర్చుకో

అక్షరాల లోవేదన అచ్చేయుట కన్ననూ
లక్షణంగ విద్యనే అందించడం నేర్చుకో

కవనమే నీ చేతి కైదువని తెలుసుకో
కరుణనే భువిలోన పెంచడం నేర్చుకో

అనుభవాల  పాఠాలు  నేర్చుకో శైలజా
ఆటంకాలెదురైన గెలవడం నేర్చుకో!!!





Saturday, June 16, 2018

బాల్యం

బాల్యం
గుండెలోన దాచుకున్న బాల్యమెంత బాగుందో
మరువలేని జ్ఞాపకాల తీరమెంత బాగుందో

కాగితాలు పడవచేసి వాననీటిలో వదలుచు
మిత్రులతో చేసినట్టి సందడెంత బాగుందో

అమ్మనాన్న అక్కలతో పంచుకున్న ఆరోజుల
అనురాగపు ఆనవాళ్ళ అల్లరెంత బాగుందో

పుస్తకాలలో దాచిన నెమలీకల జ్ఞాపకాలు
మస్తుమస్తు ఆటలతో దోస్తిఎంతబాగుందో

వెన్నెలలోఆడినట్టి ఆదాగుడుమూతలలో
కోపమొస్తె పచ్చికొట్టు గారమెంత బాగుందో

గాలితోని పోటీపడి చేలగట్లపై పరుగులు
తాయిలాలు పంచుకున్న తపనఎంత బాగుందో

కల్లకపటమే తెలియని మల్లెవంటిమనసులలో
ముల్లు గుచ్చితే ఏడ్చే మురిపెమెంత బాగుందో

బాల్యమంటె అందరికీ నజరానే శైలజా
బాధలనే మరపించే భావనెంత బాగుందో !!!

Tuesday, May 22, 2018

వాన చినుకుల ప్రేయసి




నేలతల్లికి దప్పికంతను దిద్ది వేసెను వానచినుకులె
పూలతీవెకు కొత్తవన్నెల నద్ది వేసెను వానచినుకులె

ఆకసమ్మున ధారలన్నియు అంతకంతకు హద్దుమీరెను
కాగితమ్ముల పడవలన్నియు గుర్తుచేసెను వానచినుకులె

పూలగొడుగును చేతబట్టుకు నీటిముత్యములేరుతుంటే
నాడు ఆడిన ఆటలన్నియు రాశిపోసెను వానచినుకులె

ఆకతాయీ చల్లగాలులె ఆనవాళ్ళను ఒడిసిపడితే
యవ్వనమ్మున రాగసుధలను అందజేసెను వానచినుకులె

పచ్చపచ్చని తరువులన్నియు ప్రణయరాగము లాలపిస్తే
కరిగి పోయిన కాలమంతయు కనుల నిలిపెను వానచినుకులె

నీలికలువా చందురేడని కొండకోనా అడుగుతుంటే
వానవిల్లున ప్రేమలేఖను  పంపుచుండెను వానచినుకులె!!!

Saturday, May 19, 2018

మనసా....







నా మనసే నీదయితే నవ్వులెన్ని కురిసాయో
నా ఊహల వాటికలో పూవులెన్ని మెరిసాయో

ఆశలెన్ని రేపావో పిడికెడు హృదయంలో
శ్వాసలైన వేళలలో స్వరములెన్ని మెరిసాయో

జ్ఞాపకాల సింధువులో దాచుకున్న ముత్యాలే
జాలువాఱు తరుణాన రవ్వలెన్ని మెరిశాయో

పాటలెన్ని పాడావో వలపుల పూదోటలో
బుగ్గలపై కెంపుచూసి సిగ్గులెన్ని మెరిశాయో

నీకన్నుల వాకిలిలో నన్నునేను దాచాలే
కావలిగా నేనుంటే కబురులెన్ని మెరిశాయో

చేరువలో నన్నుచూసి వీడుకోలు చెబుతావే
తీయనైన వేదనలో కవితలెన్ని మెరిశాయో!!!

అమ్మ ప్రేమకు వందనం




కాలమంత నీతోనే గడపాలని ఉన్నదిలే
నాబాల్యం  నీలోనే చూడాలని ఉన్నదిలే

ఒక్కక్షణము నినువీడి నిలువలేనులే నానీ
లాలపోసి జోలపాట పాడాలని ఉన్నదిలే

చిన్నిచిన్ని చేతులతో చిత్తరాలు చేస్తుంటే
యశోదమ్మనై నీతో ఆడాలని ఉన్నదిలే

బ్రహ్మైనా చెప్పలేని భాషలోన పలుకుతుంటె
అమ్మకన్ని తెలుసునని చెప్పాలని ఉన్నదిలే

పేగుతెంచుకున్న ప్రేమ ఎవ్వరికీ తెలియదుగా
అమ్మనీకు బొమ్మయనీ తెలపాలని ఉన్నదిలే!!!

2.
మమత కర్ధము తెలియజేసిన మాతృ ప్రేమకు వందనమ్ములు
బ్రతుకు తీపిని పంచిఇచ్చిన మాతృ ప్రేమకు వందనమ్ములు

తాను తిన్నను తినకపోయిన తనదు బిడ్డల కడుపు నింపుచు
కంటిరెప్పగ గాచి పెంచెడు కన్నప్రేమకు వందనమ్ములు

వీర జిజియాబాయి రీతిగ దేశభక్తిని పెంచుచూమది
ఉగ్గుపాలను రంగరించిన అమ్మప్రేమకు వందనమ్ములు

అవధిమీరిన మమత జూపుచు సాకె వెన్నుని ఆయశోదే
అంగరాజును పెంపుజేసిన రాధప్రేమకు వందనమ్ములు

పుత్రుడైనను పుత్రికైనను ఒక్కరీతిగ ముద్దుజేయుచు

కుప్పతొట్టెల విసరి వేయని నేటి అమ్మకు వందనమ్ములు!!!