Tuesday, May 22, 2018

వాన చినుకుల ప్రేయసి




నేలతల్లికి దప్పికంతను దిద్ది వేసెను వానచినుకులె
పూలతీవెకు కొత్తవన్నెల నద్ది వేసెను వానచినుకులె

ఆకసమ్మున ధారలన్నియు అంతకంతకు హద్దుమీరెను
కాగితమ్ముల పడవలన్నియు గుర్తుచేసెను వానచినుకులె

పూలగొడుగును చేతబట్టుకు నీటిముత్యములేరుతుంటే
నాడు ఆడిన ఆటలన్నియు రాశిపోసెను వానచినుకులె

ఆకతాయీ చల్లగాలులె ఆనవాళ్ళను ఒడిసిపడితే
యవ్వనమ్మున రాగసుధలను అందజేసెను వానచినుకులె

పచ్చపచ్చని తరువులన్నియు ప్రణయరాగము లాలపిస్తే
కరిగి పోయిన కాలమంతయు కనుల నిలిపెను వానచినుకులె

నీలికలువా చందురేడని కొండకోనా అడుగుతుంటే
వానవిల్లున ప్రేమలేఖను  పంపుచుండెను వానచినుకులె!!!

Saturday, May 19, 2018

మనసా....







నా మనసే నీదయితే నవ్వులెన్ని కురిసాయో
నా ఊహల వాటికలో పూవులెన్ని మెరిసాయో

ఆశలెన్ని రేపావో పిడికెడు హృదయంలో
శ్వాసలైన వేళలలో స్వరములెన్ని మెరిసాయో

జ్ఞాపకాల సింధువులో దాచుకున్న ముత్యాలే
జాలువాఱు తరుణాన రవ్వలెన్ని మెరిశాయో

పాటలెన్ని పాడావో వలపుల పూదోటలో
బుగ్గలపై కెంపుచూసి సిగ్గులెన్ని మెరిశాయో

నీకన్నుల వాకిలిలో నన్నునేను దాచాలే
కావలిగా నేనుంటే కబురులెన్ని మెరిశాయో

చేరువలో నన్నుచూసి వీడుకోలు చెబుతావే
తీయనైన వేదనలో కవితలెన్ని మెరిశాయో!!!

అమ్మ ప్రేమకు వందనం




కాలమంత నీతోనే గడపాలని ఉన్నదిలే
నాబాల్యం  నీలోనే చూడాలని ఉన్నదిలే

ఒక్కక్షణము నినువీడి నిలువలేనులే నానీ
లాలపోసి జోలపాట పాడాలని ఉన్నదిలే

చిన్నిచిన్ని చేతులతో చిత్తరాలు చేస్తుంటే
యశోదమ్మనై నీతో ఆడాలని ఉన్నదిలే

బ్రహ్మైనా చెప్పలేని భాషలోన పలుకుతుంటె
అమ్మకన్ని తెలుసునని చెప్పాలని ఉన్నదిలే

పేగుతెంచుకున్న ప్రేమ ఎవ్వరికీ తెలియదుగా
అమ్మనీకు బొమ్మయనీ తెలపాలని ఉన్నదిలే!!!

2.
మమత కర్ధము తెలియజేసిన మాతృ ప్రేమకు వందనమ్ములు
బ్రతుకు తీపిని పంచిఇచ్చిన మాతృ ప్రేమకు వందనమ్ములు

తాను తిన్నను తినకపోయిన తనదు బిడ్డల కడుపు నింపుచు
కంటిరెప్పగ గాచి పెంచెడు కన్నప్రేమకు వందనమ్ములు

వీర జిజియాబాయి రీతిగ దేశభక్తిని పెంచుచూమది
ఉగ్గుపాలను రంగరించిన అమ్మప్రేమకు వందనమ్ములు

అవధిమీరిన మమత జూపుచు సాకె వెన్నుని ఆయశోదే
అంగరాజును పెంపుజేసిన రాధప్రేమకు వందనమ్ములు

పుత్రుడైనను పుత్రికైనను ఒక్కరీతిగ ముద్దుజేయుచు

కుప్పతొట్టెల విసరి వేయని నేటి అమ్మకు వందనమ్ములు!!!

Wednesday, May 16, 2018

మనసుకీ




గరికలా ఒదుగుటే బోధించు మనసుకీ
ధరణిలా ఓరిమే నేర్పించు మనసుకీ

ముళ్ళున్న పూలున్న రాదారి పొడవునా
నీ ప్రేమ సవ్వడిని చూపించు మనసుకీ

చీకట్ల పరదాలు చిటికెలో ననుచుడితె
చిరునవ్వు దీపాలు వెలిగించు మనసుకీ

కన్నీటి కడలిలో ఎదురీద లేకుంటె
చుక్కానివై నీవు నడిపించు మనసుకీ

పువ్వులా కాసేపు ముల్లులా కాసేపు
కవ్వించు చెలిప్రేమ మురిపించు మనసుకీ

చింతలూ వంతలూ ఎంతలో కరుగులే
చిత్రంగా జగతినే గమనించు మనసుకీ

కన్నీటి ముత్యాలు కనబడక దాచాను
కాసిన్ని నవ్వులే పంపించు మనసుకీ

బాధనే మరువనీ భావనే మధురమూ
శైలజా నీపాట వినిపించు మనసుకీ!!!









దేవునితో ఒక్కమాట



దేవునితో ఒక్కమాట చెప్పాలనివుందీ
జీవమెందుకిచ్చావని అడగాలని వుంది

దారుణములు చూస్తున్నా నోరు మెదపలేని
మనసు నెందుకిచ్చావని అడగాలనివుంది

కులమతాల పేరిట సంకులసమరమ్ము జూసి
కన్నీటి నెందుకిచ్చావని అడగాలనివుంది

దానవత్వమే ధరణిని కబళిస్తుంటే
ఆశ లెందుకిచ్చావని అడగాలనివుంది

అక్షరతూణీరములు వదలెడు ఓ శైలజా
మాటలెందుకిచ్చావని అడగాలనివుంది..